పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్).
స్థానిక కెవిఎమ్ ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో
విద్యార్థినీ విద్యార్థులలోని బెరుకును పోగొట్టేందుకు, వ్యక్తిత్వ వికాసం, అభ్యసనా నైపుణ్యాలను పెంపొందింపజేసేందుకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, నర్సాపురం వై ఎన్ కళాశాల కామర్స్ ,మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి హెచ్ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకొనే క్రమంలో ఏకాగ్రత అవసరమని, కష్టంతో కాకుండా, ఇష్టంగా చదువుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రుల పట్ల, అధ్యాపకుల పట్ల ఎటువంటి భావాలను కలిగి ఉండాలో తెలియజేస్తూ వివిధ రంగాలలో అత్యున్నత స్థానాలకు చేరిన అబ్దుల్ కలాం, మహాత్మాగాంధీ వంటి ప్రముఖుల జీవితంలో జరిగిన సంఘటనలు ఉదహరిస్తూ వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు సంస్కారాలు వృద్ధి చేసుకోవాలని, స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని, పెరిగిన ఆధునిక సాంకేతిక వనరులను, విజ్ఞానాన్ని విద్యార్థులు తమ విద్యార్జన కొరకు వినియోగించుకుంటూ పెడ మార్గాలు పట్టకుండా తమ లక్ష్యాలను నిర్దేశించుకొని నిరంతర శ్రామికులుగా పనిచేస్తూ తమ లక్ష్యసాధన దిశగా ప్రయాణించాలని సూచించారు.
కార్యక్రమ అనంతరం కళాశాల యాజమాన్యం శ్రీనివాసరావు ను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, సెక్రటరీ,కరస్పాండెంట్
కె సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వేంకటేశ్వరరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కారుమూరి బాబ్జీ, అధ్యపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.