Telugu News Power

శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల ఫిదా.

శ్రామికులకు స్వయంగా వడ్డన చేస్తున్న మంత్రి నిమ్మల
లక్కీ డిప్ ద్వారా చీరలు అందజేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఫిదా అయ్యారు. నెలన్నర పాటు జరిగిన ఉపాధి హామీ పనులకు హాజరై, మండుటెండలో పనిచేసిన శ్రామిక లోకానికి గౌరవ సత్కారం అందజేశారు. వెలవిలి గ్రామంలో బుధవారం ఏర్పాటు అయినా సభలో శ్రామిక జన సందోహంతో మంత్రి ఉత్సాహంగా ముచ్చటించారు. శ్రామికులకు స్వయంగా, కొసరి కొసరి రొయ్యల పలావు వడ్డించారు. ఉపాధి హామీ పనులలో శ్రామికులకు మంత్రి మొబైల్ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మంత్రి స్వయంగా మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా వారికి విందు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు, మానవసేవే మాధవ సేవగా భావించి ఈ విందు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. లక్కీ డిప్ ద్వారా శ్రామికులకు మంత్రి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా సరదాగా మాట్లాడుతూ, మీ వారు ఎప్పుడైనా మీకు చీర కొనితెచ్చారా అని అడగటంతో ఆడపడుచుల మొఖాల్లో సిగ్గు మొగ్గలేసి సభలో నవ్వులు వెళ్లి విరిసాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నదని తెలిపారు. సూపర్ సిక్స్ పథకం ద్వారా ప్రజల ఆర్థిక ఎదుగుదలకు చేయూతనిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పనులలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన దాతలకు, సేవలందించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు, మండల విద్యాధికారి, గుమ్మల్ల వీరస్వామి, మండల టిడిపి అధ్యక్షులు పాముల రజిని కుమార్, కందుల వెంకటేశ్వరరావు, గోడపాటి వెంకటరమణ, దొమ్మేటి ఏసుదాసు, కోటి బాబు, పెద్దింటి శ్రీను, ఆశీర్వాదం, సునీల్ రాజు, కంది బోయిన నాగరాజు, నాగేశ్వరరావు, తదితరులు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు.