
నిధుల విడుదల కోసం లోక్ సభ లో కేంద్రమంత్రి షెకావత్ కు ఏలూరు ఎంపీ పుట్టా వినతి.
న్యూఢిల్లీ / అమరావతి:జూలై, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
భారతదేశ సాంస్కృతిక, కళా వారసత్వానికి గణనీయమైన కృషి చేసిన వృద్ధ కళాకారులకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తున్న పింఛను పధకం గత ఆరేళ్లుగా ఆగిపోయిందని, మానవతా దృక్పథంతో వెంటనే ఈ బకాయిలు విడుదల చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ . బుధవారం లోక్ సభలో విజ్ఞప్తి చేశారు. నిబంధన 377 కింద వృద్ధ కళాకారుల ఇబ్బందులను ఎంపీ సభ దృష్టికి తెచ్చారు. ఈ పథకం కింద లబ్ధిదారులు 2019 నుంచి పింఛన్లు నిలిచిపోయాయి. దీంతో దాదాపు ఆరేళ్లుగా చాలా మంది వృద్ధ కళాకారులు వైద్య చికిత్స, అద్దె, రోజువారీ జీవన ఖర్చులతో సహా ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. కళలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారికి ఈ పింఛను వారి వృద్ధాప్యంలో ఏకైక ఆసరాగా నిలుస్తుందన్నారు.పెండింగ్‌లో ఉన్న కళాకారుల పింఛన్లను త్వరితగతిన విడుదల చేయాలని కళలు, సాంస్కృతిక వ్యవహారాల కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఈ విషయాన్ని లేవనెత్తే సమయానికే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో, ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపుతున్నట్లు ప్రకటించి, స్పీకర్ సభను వాయిదా వేశారు. సీనియర్ కళాకారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆర్ధిక సహాయాన్ని పొందేందుకు, తనవంతుగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చినట్లు ఎంపీ మహేష్ కుమార్ వివరించారు.