Skip to main content

Telugu News Power

మంత్రి దుర్గేష్ ను కలిసిన “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన జెస్సీ.

జెస్సిని అభినందిస్తున్న మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం: జూలై,26 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ, ఆమె తల్లిదండ్రులను, ఆదివారం రాజమహేంద్రవరంలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జెస్సీని శాలువాతో సత్కరించి, ఆమెకు అభినందనలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సీ ఎంపిక కావడం మన రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, అంతరిక్ష విజ్ఞాన రంగంలో తన ప్రతిభను చాటుతున్న జెస్సీ ప్రయాణం ప్రతి విద్యార్థికీ స్ఫూర్తిదాయకంగా
నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి శాటిలైట్ రూపకల్పనలో పాల్గొనే ఈ అరుదైన అవకాశాన్ని జెస్సీ సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
జెస్సీ ప్రతిభకు ప్రోత్సాహంగా శిక్షణ, పర్యటనకు అవసరమైన విమాన ప్రయాణ టికెట్లు, వసతితో పాటు స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. జెస్సీ అంతరిక్ష విజ్ఞాన రంగంలో మరిన్ని విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.