విద్యార్థుల ప్రతిభా ప్రోత్సహక బహుమతి ఏర్పాటు.
పాలకొల్లు: సెప్టెంబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే బహుమతి ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.1.25 లక్షల చెక్కును ఎండోమెంట్ ప్రైజ్ కోసం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యంకు శనివారం అందజేశారు.ఈ ఎండోమెంట్ ద్వారా కళాశాలలోని కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, పొలిటికల్ సైన్స్ విభాగాలలో ప్రతి సంవత్సరం ఫైనల్ ఇయర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, సిపీడీసీ సభ్యులు మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఎండోమెంట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల పట్ల వారికి ఉన్న వాత్సల్యాణికి గొప్ప నిదర్శనమన్నారు. డాక్టర్ టి. రాజరాజేశ్వరి సేవా భావాన్ని, విద్యార్థుల పట్ల ఆమెకున్న ప్రత్యేక అభిమానాన్ని కొనియాడారు. ఈ ఎండోమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు గుర్తింపు లభించడంతో పాటు, ఇతర విద్యార్థులు కూడా మరింత కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించేందుకు ప్రేరణ పొందుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, సీపీడీసీ సభ్యులు డాక్టర్ ఎస్వీ రంగారావు, అద్దేపల్లి మోహన్ దాస్, నిమ్మకాయల సత్యనారాయణ, శ్రీనాథ్, అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.