
రాజమహేంద్రవరం: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేయనున్నట్టు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కులపతి, ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య సభల నిర్వహకులు, మాజీ ఎమ్మెల్సీ , కలిదిండి సత్యనారాయణ రాజు, చైతన్య రాజు వెల్లడించారు. మహాసభలను చైతన్య రాజు, గోదావరి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర స్థాయిలో రాష్ట్రాల గవర్నర్ల ఉన్నత స్థాయి సమావేశంలో తాను ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ ఈ విషయంలో సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. తల్లిదండ్రులే విద్యార్థులకు తొలి గురువులుగా, తెలుగును మాతృభాషగా గౌరవించి, వాడకంలోకి తేవాలని సూచించారు. భాష ఒక జాతి సంస్కృతి సాంప్రదాయాలకు ఘనమైన చరిత్రకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికీ మూడుసార్లు ప్రపంచ స్థాయి తెలుగు సభలు నిర్వహించినట్టు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీ శ్రీ కళా వేదిక అన్ని కార్యక్రమాలు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తమ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కోర్సులు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఆడ జరిగే పుష్కరాలకు 12 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
శ్రీ శ్రీ కళా వేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ, తమ సంస్థ రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. తెలుగు సాహితీ రంగ పరిరక్షణకు నెలవారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒకే ఒక సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అన్నారు. ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా, నిస్వార్ధంగా తమ సంస్థ సేవ చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జి యు డి ఎ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, టీటీడీ ఎన్నారై కోఆర్డినేటర్ రాజశేఖర్, ఐపీఎస్ అధికారి కొండా నరసింహారావు, సంపాదకులు ఎర్రాప్రగడ రామకృష్ణ, ప్రముఖ కవి బోయి భీమన్న సతీమణి హైమావతి, కళా వేదిక ప్రధాన కార్యదర్శి టి పార్థసారథి, తెలుగు యూనివర్సిటీ రిజిష్ర్టార్ శ్రీనివాసరావు, గౌరీ శంకర్, ఎన్నారై వెంకట్ ఆళ్ల, తదితరులు మహాసభలను కొనియాడారు. శ్రీ శ్రీ కళావేదిక కార్యదర్శి ఈశ్వరి భూషణం సభను తన సాహితీ పాండిచ్య ప్రతిభతో సమర్థవంతంగా ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు. ఈ సభలకు వేల సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారు.
తెలుగు వైభవం, సంస్కృతీ సౌరభం వెళ్లి విరిసిన నేల.
అత్యంత వైభవంగా ప్రారంభమైన ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలు ఘనమైన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టాయి. సాంప్రదాయ నృత్యాలు, జానపద ప్రదర్శనలు, సంగీత వాయిద్యాల వీనుల విందు, హరికథ, బుర్రకథ, లైవ్ ట్రాక్ సింగింగ్, ఏకపాత్రాభినయం వంటి అనేక ప్రక్రియలు ఇక్కడ ప్రదర్శించారు. వీక్షించిన ప్రేక్షకులు ఆనంద అనుభూతిని పొందారు. ఒకే వేదికపై సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించే అవకాశం కల్పించిన నిర్వాహకులకు, స్థల దాతకు కృతజ్ఞతలు తెలిపారు.