Skip to main content

Telugu News Power

ఘనంగా మావుళ్లమ్మ శ్రావణ పౌర్ణమి వేడుకలు

చండీయాగం
అష్టభుజ లక్ష్మి దేవి అవతారంలో ఉత్సవమూర్తి

మావుళ్లమ్మ సన్నిధిలో చండీహోమం

99 జంటల ప్రత్యేక పూజలు

అష్టభుజ శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తి ప్రత్యేక ఆకర్షణ

లోకక్షేమం.. సకల సంపదల కోసం మావుళ్లమ్మకు చండీహోమం

భీమవరం: ఆగస్టు,28( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో యథావిధిగా నిర్వహించే చండీహోమాన్ని ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రజల క్షేమం, పాడిపంటలు సమృద్ధిగా పండడం, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలు, సకల సంపదలు చేకూరాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ చండీహోమంలో 99 మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారని దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

ఆకట్టుకున్న అష్టభుజ శ్రీ మహాలక్ష్మి :

దేవస్థానం ఉత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 చేతులతో కూడిన అష్టభుజ శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఉత్సవమూర్తి చుట్టూ వివిధ దేవతామూర్తుల ముద్రలతో నవకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ అలంకరణ, పూజా విధానం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

చండీహోమం సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలు, హోమగుండం నుంచి వెలువడిన పవిత్రాగ్ని, ఆలయ ప్రాంగణంలో నెలకొన్న భక్తి వాతావరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

లోకక్షేమం, ప్రజల ఆరోగ్యం, సుఖసంతోషాలు, పాడిపంటల అభివృద్ధి, వ్యాపార వృద్ధి, కుటుంబాల్లో ఐశ్వర్యం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు, అరసవిల్లి సుబ్రహ్మణ్యం, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, వేదపండితులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.