పెనుమంట్ర: జూన్, 5
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుమంట్ర మండలం మార్టేరులో పర్యావరణ పరిరక్షణపై సైకిల్ ర్యాలీ ద్వారా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, ర్యాలీలో సైకిల్ సవారి చేశారు.వెలగలేరు సొసైటీ నుంచి మార్టేరు శ్రీ వేణుగోపాల ఆడిటోరియం వరకు నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని “పర్యావరణాన్ని కాపాడుకుందాం – కాలుష్యాన్ని తగ్గిద్దాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. అనంతరం నెగ్గిపూడి గ్రామంలోని శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధి హామీ పథకం భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు పాల్గొని పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు.
“పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి” అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారంలో ఒక రోజు సైకిల్ లేదా పర్యావరణ హిత వాహనాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు.ఇంధన పొదుపు, ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో సైకిల్ వినియోగం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న దూరాలకు మోటార్ వాహనాల బదులు సైకిళ్లను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ప్రోత్సహించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని ప్రతినబూనారు.
పర్యావరణ పరిరక్షణ అవగాహన సైకిల్ ర్యాలీ. సైకిల్ తొక్కిన కలెక్టర్, ఎమ్మెల్యే.
సైకిల్ ర్యాలీ చేస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పితాని, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి