
సీఫుడ్ ఎగుమతులను లక్ష కోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
విశాఖపట్నం: జూన్ 5: భారత సముద్ర ఆహార (సీఫుడ్) ఎగుమతులను మరింత బలోపేతం చేసి ప్రపంచ మార్కెట్లో దేశ స్థాయిని పెంచేందుకు విశాఖపట్నంలో శుక్రవారం జాతీయ స్థాయి సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తదితరులు పాల్గొన్నారు.
సముద్ర ఆహార ఎగుమతుల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ట్రేసబిలిటీ వ్యవస్థల బలోపేతం, నాణ్యత ప్రమాణాల పెంపు, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వం సాధించడం వంటి అంశాలపై వర్క్‌షాప్‌లో చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు, స్టార్టప్‌లు, మత్స్యకారులు, రైతులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.73,890 కోట్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసి రికార్డు సృష్టించిన నేపథ్యంలో, ఈ రంగాన్ని మరింత విస్తరించి రూ.1 లక్ష కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
రాష్ట్రాల వారీగా ఎగుమతి వ్యూహాల రూపకల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం, విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపు, అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై సాంకేతిక సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ వర్క్‌షాప్ ద్వారా భారత సీఫుడ్ రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ఆదర్శ రైతు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సంఘ అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆక్వారంగాన్ని కాపాడడానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నైలో ఉన్న క్యారంటైన్ కేంద్రాన్ని కేంద్రాన్ని విశాఖపట్నం తరలించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి పియూష్ గోయల్ ఆ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. అధికారులు
రూ. 20 నుంచి 30 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆక్వా రైతులు ఈ సందర్భంగా తన హర్షం వ్యక్తం చేశారు.