
పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) చోరీ కి గురైన సుమారు రూ. 19 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న ట్టు నర్సాపురం డిఎస్పి ఎం సుధాకర్ రావు వెల్లడించారు. స్థానిక రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి చోరీకి సంబంధించి వివరాలు తెలియజేశారు. నర్సాపురం, రుస్తుంబాదకు చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి నరేష్, రాజమహేంద్రవరానికి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన గోడి సతీష్ కుమార్ లు తాళాలు వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని, చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోడూరు, పాలకొల్లు, పెనుమంట్ర, కాళ్ళ పోలీస్ స్టేషన్ 8 కేసులు మొదలైనట్టు తెలిపారు. నిందితుల్లో ఒకరైన కొత్తపల్లి నరేష్ ను గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సమావేశం అనంతరం నిందితున్ని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు. నిందితుడు నుంచి స్వాధీనం చేసుకున్న, 142 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు కేజీల వెండి వస్తువులు ప్రదర్శించారు. సహ నిందితుడు గోడి సతీష్ కుమార్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు సమర్థవంతంగా, చాకచక్యంగా వ్యవహరించి నిందితున్ని పట్టుకోవడంలో ముందున్న రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్, ఎస్సై సురేంద్ర కుమార్, పోడూరు ఎస్సై సుధాకర్ రెడ్డి, ఐడి పార్టీ కానిస్టేబుళ్లు, బాలాజీ, ప్రసాద్ లను జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి, డి.ఎస్.పి.ఎం సుధాకర్ రావు అభినందించారు. మీడియా సమావేశంలోనే వారికి డి.ఎస్.పి రివార్డులు అందజేశారు.