Telugu News Power

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత.

న్యూఢిల్లీ: భారత షూటింగ్ రంగానికి చెందిన దిగ్గజ క్రీడాకారుడు, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) గుండెపోటుతో కన్నుమూశారు. రాణా శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని మ్యాక్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం భారత పిస్టల్ షూటర్ల హై-పర్ఫార్మెన్స్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాణా ఇటీవల జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన ఐ ఎస్ ఎస్ ఎఫ్ వరల్డ్ కప్ పోటీలకు హాజరయ్యారు. అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి గుండెపోటుతో మరణించారు.
జస్పాల్ రాణా భారత షూటింగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన క్రీడాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు అనేక పతకాలు అందించిన ఆయన, క్రీడాకారుడిగా మాత్రమే కాకుండా కోచ్‌గా కూడా విశేష సేవలు అందించారు. యువ షూటర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన రాణా మరణం భారత క్రీడా ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు.
ఆయన మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మన్ష్ క్ మాండవియా, క్రీడాకారులు, కోచ్‌లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు