Telugu News Power

మాజీ ముఖ్యమంత్రివర్యులు నాదెండ్ల కు తుది వీడ్కోలు.

అంతిమయాత్ర అధికారిక లాంఛనాలతో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.
ప్రముఖుల నివాళి.
హైదరాబాద్: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు నాదెండ్ల భాస్కరరావుకు కడసారి నివాళులర్పించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో భాస్కర రావు పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను పలకరిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని ఓదార్చారు. భాస్కర రావు కుమారుడు ఏపీ పౌరసరఫరాలు, ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి
నాదెండ్ల మనోహర్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీలకు అతీతంగా భాస్కర రావు తుది వీడ్కోలు పలికేందుకు రెండు తెలుగు రాష్ర్టాల ప్రముఖులు హాజరయ్యారు.నాదెండ్ల భాస్కర్ రావు మృతి వార్త తెలుసుకొని బుధవారం సాయంత్రం నుంచి ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు ప్రముఖులు తరలివస్తూనే ఉన్నారు. గురువారం ఉదయం అగ్ర కథానాయకులు చిరంజీవి, భాస్కరరావు పుష్పాంజలి ఘటించారు. మనోహర్ ని పలకరించి ధైర్యం చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి అల్లు అరవింద్, బన్నీ వాసు, పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఉన్నారు. రాజకీయ రంగం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివేక్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారధి, సవిత, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర రావు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవ రావు, టి.సుబ్బరామి రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఏపీ ఎమ్మెల్యేలు బుద్ధ ప్రసాద్, సుజనా చౌదరి, పత్సమట్ల ధర్మరాజు, పంతం నానాజీ, అరవ శ్రీధర్, పత్తిపాటి పుల్లారావు, బొమ్మిడి నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, హరిప్రసాద్ ఎం ఎల్ సి, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ , మాజీ మంత్రి రఘువీరారెడ్డి, యూత్ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
*అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు.
నాదెండ్ల భాస్కరరావు
కు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రత్యేక ప్లాటున్ బృందం ఆయన నివాసానికి చేరుకుని గౌరవం వందనం చేశారు. అక్కడి నుంచి అంతిమయాత్ర పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు నాదెండ్ల మురళి సంప్రదాయబద్ధంగా అంతిమ క్రతువులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. చివరి మజిలిలో కుటుంబ సభ్యులు, అభిమానుల ఆయనకు తుది కన్నీటి వీడ్కోలు పలికారు.

నాదెండ్లకు నివాళులర్పిస్తున్న చిరంజీవి