
తాడేపల్లి: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్)రొయ్యల దాణ ధరల పెంపు, రొయ్యల ధరలు తగ్గింపు వంటి దుర్మార్గపు చర్యలకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందు వర్గానికి చెందిన ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు కారణమని నరసాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఆక్వా రైతుల బృందానికి ప్రసాద్ రాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం రొయ్యల రైతులను దోచుకోకుండా అప్సడా చట్టం చేసిందని పేర్కొన్నారు. రొయ్యల రైతులకు యూనిట్ ఒకటిన్నర రూపాయలకే సబ్సిడీపై అందించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అప్సడా చట్టాన్ని తుంగలో తొక్కి ఏకపక్షంగా, గుత్తాధిపత్యంతో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్సిడీ కూడా ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం ఎవరికి వర్తించడం లేదని వెల్లడించారు. ఈ సమస్యకు పరిష్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చూపగలరని రొయ్యల రైతులు ఒత్తిడి చేయడంతో తాను తరలి వచ్చానని మాజీ ముఖ్యమంత్రి కి ప్రసాదరాజు వివరించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతుల నాయకులు తమ ఆవేదనను జగన్మోహన్ రెడ్డికి నివేదించారు.
