యానాం: పుదుచ్చేరి 16వ శాసనసభలో నాలుగో సారి మంత్రిగా యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చోటు దక్కింది.పుదుచ్చేరి శాసనసభకు ఐదోసారి ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.
సీఎంతో పాటు ఇద్దరు సీనియర్లకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బిజెపి నుండి పుదుచ్చేరికి చెందిన నమశ్శివాయః కు అవకాశం ఇచ్చారు.
సీఎం రంగసామితో పాటు పుదుచ్చేరిలోని గవర్నర్ లోక్ నివాస్ లో మల్లాడి, నమశ్శివాయఃలు ప్రమాణస్వీకారం చేశారు.
సీఎం రంగసామితో పాటు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాధన్, సీఎం రంగస్వామి, కేంద్ర హోంశాఖ అధికారులకు మల్లాడి కృతజ్ఞతలు తెలిపారు.
యానాం నియోజవర్గంలో ప్రజలు , ఇతర రాష్ట్రాలు వివిధ ప్రాంతాల్లో నన్ను అభిమానించే ప్రజలు ఈ సంతోషకరమైన విషయాన్ని మీకు తెలియజేయుటకు సంతోషిస్తున్నానని మల్లాడి తెలిపారు. తన శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా చేరువలో ఉన్న యానం తెలుగు ప్రాంతం అయినప్పటికీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. గతంలో ఫ్రెంచ్ వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల, నేటికీ పుదుచ్చేరి శాసనసభ స్థానంగానే యానం కొనసాగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా ఇది కోరుకుంటున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల వివిధ పన్నులు, సుంకాలు తక్కువగా ఉండటం ప్రధాన కారణం. గతంలో గొల్లపల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. తాజా ఎన్నికల్లో మల్లాడి మరోసారి గెలుపొందారు.