Telugu News Power

సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు. -నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్.

డీఎస్పీ ఎం సుధాకర్

నరసాపురం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ నెల 13న నరసాపురం మండలం, సీతారాంపురం సౌత్ గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద జరిగిన ర్యాలీని ఉద్దేశించి, కొందరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్‌లో అభ్యంతరకరమైన పోస్టులు మరియు వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఉన్న ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ, మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద చట్టం-2015 మరియు ఐటి చట్టం-2000 లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఈ సున్నితమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో వాస్తవాలను వక్రీకరిస్తూ, తప్పుడు సమాచారాన్ని మరియు అసత్య వార్తలను కావాలనే ప్రచారం చేస్తున్నట్లు గమనించాము. ఇటువంటి తప్పుడు ప్రచారాలు సమాజంలో అశాంతికి దారితీసే అవకాశం ఉన్నందున, సోషల్ మీడియా వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.
ఎవరైనా ఈ ఘటనకు సంబంధించి నిర్ధారణ లేని వార్తలను షేర్ చేసినా, గ్రూపులలో ఫార్వర్డ్ చేసినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టినా, వారిపై ఐటీ చట్టం మరియు కొత్త శిక్షా స్మృతి(భారతీయ న్యాయ సంహిత) నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి, సమాజంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.