యలమంచిలి మండల పరిషత్ సమావేశానికి సంబంధిత అధికారులు విధిగా హాజరుకావాలని అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం,కార్యాలయ సమావేశం మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు ఇంచుమించు అందరూ గైరహాజరయ్యారు. వివిధ కారణాలు చూపి వారి కార్యాలయ సిబ్బందిని సమాచారం లేకుండా, ఉన్న సభ్యులు సరిగ్గా వివరించలేకపోవడం వల్ల ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార మార్పిడి తరువాత బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఇంచార్జీ )జెడి ప్రసాద్ నిర్వహించారు. మేడపాడు ఆసుపత్రి పాతభవనం శిథిలావస్థలో ఉండగా, కొత్త నిర్మాణం ఎందుకు ముందుకు సాగటం లేదని స్థానిక ఎంపీటీసీ డేగలసూర్య ప్రభ ప్రశ్నించారు. యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కార్యాలయానికి పరిమితమై ఉంటున్నారని, ఒక్క ఇంటిని కూడా సందర్శించిన పాపాన పోలేదని, ఇటీవల అనారోగ్యం పాలైన ఒక వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే, అక్కడ సరైన వైద్యం అందక పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చమని, ఇందుకు 70 వేలు ఖర్చయిందని, ఊటాడ సర్పంచ్ బుడితి జయరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారి రాని కారణంగా, సహాయ వ్యవసాయ అధికారి లక్ష్మి సమావేశానికి వచ్చారు. రైతులకు 3.8 కోట్ల రూపాయల లబ్ధిని కేంద్రం పథకాలతో కలిపి అందించినట్టు తెలిపారు. మండలంలో విద్యార్థులకు వివిధ ప్రభుత్వ పథకాలు ద్వారా దాదాపు కోటి రూపాయలు వ్యయం చేసామని మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణ రాజు తెలిపారు. 30 పాఠశాలకు మనబడి మన భవిష్యత్తు పథకంలో ఏడు కోట్లకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్నవారికి లక్షన్నర రూపాయలు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ సిబ్బంది వెల్లడించారు. ఈ పథకం ప్రస్తుతం అమల్లో ఉందని, ఆన్లైన్ చేయించుకోవచ్చని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మండలంలో పది మత్యకార సంఘాలకు 5 లక్షల వరకు రుణం ఇస్తున్నట్టు మత్స్య శాఖ సిబ్బంది తెలిపారు. ఆక్వా రైతులు తప్పక అనుమతులు తీసుకోవాలని, అందువల్ల విద్యుత్ రాయితీ లభిస్తుందన్నారు. ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా 54 ఎకరాల్లో కొబ్బరి, కోకో సాగు చేపట్టారన్నారు. ఇందుకు లక్ష రూపాయల వరకు రుణం లభిస్తుందన్నారు. పెదలంక సర్పంచ్ తాళ్ళ నాగ రాజు మంచినీటి పథకం చేపట్టాలని కోరారు. ఎంపీటీసీ డేగల సూర్య ప్రభ కాజ మురుగు కాలువ పనుల గురించి వివరాలు కోరగా సంబంధించిన శాఖ నుంచి సేకరించి ఇస్తామన్నారు. గత నుంచి జరిగిన అభివృద్ధి పనులకు వివరాలు కోరగా ఎంపీటీసీ డేగల సూర్య ప్రభ తనకు ఏ విధమైన జవాబు రాలేదన్నారు. అయితే సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చు అని ఈ ఓ పి ఆర్డి ఇన్చార్జి ఎంపిడిఓ ప్రసాద్ సూచించారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకుల్లో సరైన సేవలు అందడం లేదని, మహిళలను గౌరవంగా చూడవలసిన బాధ్యత బ్యాంకు వారిపై ఉందని కనకాయలంక ఎంపిటిసి, ఉపాధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసు వెలుగు సిబ్బందికి సూచించారు. యలమంచిలి మండలం అంగన్వాడిల్లో సహాయకుల ఉద్యోగాలు నాలుగు ఖాళీగా ఉన్నట్టు సమావేశంలో తెలిపారు. తుఫాను వల్ల ప్రజలకు ఎదురైన కష్టనష్టాలు ఏవి ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు కొప్పాడి శ్రీనుబాబు,జిల్లెళ్ళ రత్నం రాజు, చిలుకూరి రాజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
