భీమవరం: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో ఉపాధి హామీ పనిదినాల కల్పనలో ఎటువంటి లోటు ఉండకూడదని, అర్హులైన ప్రతి వ్యక్తికి పని దొరికేలా ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు, గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ, అప్సడా రిజిస్ట్రేషన్లు, ఈ-కేవైసీ, మనమిత్ర సర్వే, యూఎఫ్ఎస్ సర్వే అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పనిదినాల కల్పనలో గణనీయమైనలోటు కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో రోజుకు సుమారు 44 వేల పనిదినాలు కల్పించాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 14,196 మందికి మాత్రమే దాదాపు 23 వేల పనిదినాలు కల్పించడం సరైనది కాదన్నారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, ప్రతి పంచాయతీలో కనీసం 2 వేల మంది కార్మికులకు రోజువారీగా పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో పనులకు ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసిన కలెక్టర్, కాలువలు, ఫీడర్ చానల్స్ పూడికతీత, డ్రైనేజీ పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించాలని సూచించారు. కొన్ని పంచాయతీల్లో పనుల కల్పన పూర్తిగా నిలిచిపోయినట్లు గమనించామని, ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనిదినాలు పెరగకపోతే జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఎలా వస్తాయని, ఈ నిధులు గ్రామాల అభివృద్ధికి కీలకమని మీకు తెలియదా అని ప్రశ్నించారు. అందువల్ల పనుల అమలును వేగవంతం చేయడం అత్యవసరమన్నారు.
ప్రస్తుతం కాలువలు, డ్రైన్లలో నీరు తగ్గిన పరిస్థితిని ఉపయోగించుకుని గుర్రపు డెక్కను సేకరించి పెద్ద ఎత్తున వర్మీ కంపోస్ట్ తయారీ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అప్సడా రిజిస్ట్రేషన్లలో భీమవరం, ఆకివీడు మండలాలు వెనుకబడి ఉన్నాయని పేర్కొన్న కలెక్టర్, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఏకీకృత కుటుంబ సర్వేను 100 శాతం పూర్తి చేయడం పై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే ఈ-కేవైసీ, మనమిత్ర సర్వే, యూఎఫ్ఎస్ సర్వేలలో గణనీయమైన ప్రగతి సాధించాలని అధికారులను ఆదేశించారు.
ఈ జూమ్ సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్వామా పీడీ డాక్టర్ కె.సి.హెచ్ అప్పారావు, జిల్లా స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు అధికారి వెంకటలక్ష్మి, జిల్లా మత్స్యశాఖ అధికారులు, ఏడీలు, ఎఫ్డీవోలు, వీఎఫ్ఏలు, డ్వామా డిపిఎంలు, ఏపీఎంలు, ఎంపీడీవోలు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ నాగరాణి