భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేలుపు, ప్రముఖ ఆరాధ్యదైవమైన శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణ మహోత్సవం వచ్చేనెల1న ఉదయం 9 గంటలకు శ్రీ అమ్మవారి మహిళా సేవకులు ఘనంగా సమర్పించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమం
శ్రీ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పూరి గుడి నుంచి శోభాయాత్ర ప్రారంభమై భీమేశ్వరస్వామి గుడి, పొట్టి శ్రీరాములు జంక్షన్, తాలూకా ఆఫీస్ మీదుగా దేవస్థానానికి చేరుకుంటుందని వివరించారు. అనంతరం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య సంప్రోక్షణ నిర్వహించి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి మహిళా సేవకులు సారె సమర్పిస్తారు.
ఈ పవిత్ర మహోత్సవంలో భక్తులు, మహిళా సేవకులు తమ శక్తి మేరకు సారె సమర్పించి, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతులు పొందాలని దేవస్థానం అధికారులు కోరారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళా సేవకులు భీమవరం పట్టణానికి చెందిన మద్దాల విజయలక్ష్మి, గూట్లపాడు గ్రామానికి చెందిన కొప్పర్తి దేవి ఆదిలక్ష్మి, ఉండి గ్రామానికి చెందిన గిడుతూరి రామలక్ష్మి తదితర మహిళా సేవకులు విజ్ఞప్తి చేశారు.
