Skip to main content

Telugu News Power

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరికకు రంగం సిద్ధం. రేవులో రాకపోకలు బంద్.

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

అమరావతి:జూలై,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏ పీ ఎస్ డి ఎమ్ ఏ) అప్రమత్తత హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని, వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే శనివారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్న తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 3 ఎన్‌డీఆర్‌ఎఫ్, 3 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
లోతట్టు ప్రాంతాలు, గోదావరి లంక గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది.
ప్రజలు నదిలో స్నానాలు, ఈత, చేపల వేట వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అధికారిక హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు.