Telugu News Power

తెలుగు సినిమాకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిన ఏడిద నాగేశ్వరరావు జయంతి నేడు.

హైదరాబాద్: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) చలనచిత్ర ప్రపంచంలో ఓ అద్భుత కళాఖండం శంకరాభరణం తెలుగు చిత్రం. అంచనాలకు అందని బడ్జెట్, కేవలం 11 లక్షల రూపాయలు, సమయం 8 వారాల లోపు, ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తి చేసిన చిత్రం”శంకరాభరణం”. అమెరికా ప్రేక్షకుల నీరాజనాలతో 45 రోజుల పాటు శంకరాభరణం నైట్ పేరుతో ప్రదర్శింపబడిన “శంకరాభరణం”, స్వర్ణకమలం అందుకున్న తెలుగు తేజం. ఫ్రాన్స్ లో సంగీత చిత్రాల విభాగంలో బెసొంకన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్ర అవార్డు సాధించింది. చిత్ర నిర్మాత నాగేశ్వరరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులపాటు ఈ సినిమాకు ఓపెనింగ్స్ లేవు. అయినా, వేరవకుండా, అద్భుత విజయాన్ని అందుకున్నారు ఏడిద.వీరు కోనసీమ జిల్లా కొత్తపేటలో జన్మించారు. తండ్రి సత్తిరాజు నాయుడు, తల్లి పాప లక్ష్మి,. వీరిది సామాన్య రైతు కుటుంబం. తన మేనమామ కూతురు జయలక్ష్మి ని 1954 లో తను పుట్టినరోజునే వివాహమాడారు. వీరికి కుమారై ప్రమీల, కుమారులు విశ్వ మోహన్, రియల్టర్ గా స్థిరపడ్డారు. శ్రీరామ్ సినిమా నటులు. రాజా నిర్మాత. నాగేశ్వరరావు బాల్యం నుంచే నాటికల్లో నటించడం ప్రారంభించారు. దర్శక నిర్మాత, వి రాజేంద్ర ప్రసాద్, నటుడు హరినాథ్, హాస్యనటులు మాడ వెంకటేశ్వరరావు, కేకే శర్మ, వడ్డాది బృందంతో కళా ప్రపూర్ణ రాఘవ నిలయం అనే నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ కళాపరిషత్తు ద్వారా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, అవార్డులు అనుకున్నారు. వి బి రాజేంద్రప్రసాద్ కోరిక మేరకు మద్రాసు వెళ్లి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చిన్న చిన్న వేషాలు వేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. అయితే అనుకున్నంత గొప్పగా అవకాశాలు రాలేదు. మిత్రులతో కలిసి తమిళ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్వర కళ్యాణం గా విడుదల చేశారు. వెంకటేశ్వరుడు కరుణించడంతో నా చిత్రానికి లాభాలు బానే వచ్చాయి. ఉత్సాహంతో గీత కృష్ణ కంబైన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ తో ఉన్న పరిచయంతో సంగీతం, సామాజిక ప్రయోజనం కల సిరిసిరిమువ్వ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. తరువాత ఇతర భాషలో కూడా అనువదించారు. కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో తాయారమ్మ బంగారయ్య చిత్రం పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ద్వారా నిర్మించారు. భారతి రాజా దర్శకత్వంలో నిర్మించిన సీతాకోకచిలుక సినిమా జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ చిత్రం అవార్డులు దక్కాయి. సితార, స్వాతిముత్యం, సాగర సంగమం వేటికవే కళాఖండాలుగా గుర్తింపు పొందాయి. స్వాతిముత్యం ఆస్కార్ కు దక్షిణాది నుంచి నామినేట్ చేయబడిన మొదటి చిత్రం. సిరివెన్నెల, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, స్వరకల్పన, చిత్రాల్లో సంగీతం పండిత పామర జనరంజకంమై, సమాజానికి ప్రగతిశీల సందేశం ఇచ్చిన చిత్రాలు. సాగర సంగమం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదయి అపూర్వ విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం బెంగళూరు 575 రోజులు ఆడింది. ఎన్నో అవార్డులు తన ఖాతా లో వేసుకుంది. కొత్తవారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన వారిలో ఏడిద ఒకరు. వీరు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎన్నో పదవులు అలంకరించారు. తన సేవలతో వాటికి గౌరవం తెచ్చిపెట్టారు. ఈ కళామతల్లి ముద్దుబిడ్డ 2015,అక్టోబర్, 4న చిత్ర సీమ విడిచి స్వర్గసీమకు తరలి వెళ్లారు. జీవితకాలం కళామతలి సేవలో తరించారు ఏడిద నాగేశ్వరరావు. వారికి ఘన నివాళి.

తెలుగు చలనచిత్రంగా గతిని మార్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు