పాలకొల్లు: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) మానవ విలువలు ముందు తరాలకు అందించడానికి ప్రజలలోకి వెళ్లాలని నాటక రచయిత, నటుడు, ప్రయోక్త, నంది అవార్డు గ్రహీత, తాళాబత్తుల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక రసధుని సాహిత్య సంస్థ, నెలవారి కార్యక్రమాల్లో భాగంగా, గురువారం, పింఛనుదారుల భవనం, సిరి తోటి రాఘవులు, దండు చిన రామకృష్ణంరాజు సమావేశ మందిరంలో “నాటక రంగం-మానవీయ కోణం” అనే అంశంపై వక్త తాళాబత్తుల వెంకటేశ్వరరావు ప్రధానోపన్యాసం చేశారు. ఈ సభకు, కొట్టి భాస్కరరావు అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి వెంకటరత్నం స్వాగతం పలికారు. హరివిల్లు, గంగా నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రధాన వక్త మాట్లాడుతూ, ప్రస్తుత సమాజం లో మానవీయ విలువలు ఘోరంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించే మాధ్యమం ఏది ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేదన్నారు. సినిమాలు, సీరియళ్లు, సెల్ ఫోన్లు మానవ సమాజ సంబంధాలను విచ్చన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ విలువల విలోమము వల్ల ముందుతరాలకు సమాజంలో దశాదిశా లేకుండా పోతుందన్నారు. ఈ సందర్భంగా నాటకం రంగం గురించి నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామక్రమాన్ని సోదోహరణంగా వివరించారు. మానవులు కాపాడటానికి నాటక రంగం వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వీధి నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు అన్నారు. తద్వారా ముందు తరాలకు మానవీరులపై అవగాహన, ఆచరణ కల్పించడానికి వీలవుతుందన్నారు. కావ్యాలు అన్నిటిలోకి నాటకం రమ్యం అన్నారని, నాటకంలో నవరసాలు పలికించి, ప్రత్యక్షంగా ప్రజలలో భావోద్వేగాలు కల్పించడం ద్వారా, మానవీయ విలువలు సమాజంలో నిలబెట్టే శక్తి ఉందన్నారు. కాళిదాసు, అభిజ్ఞానశాకుంతలం, నుంచి గురజాడ కన్యాశులకం, కందుకూరి వీరేశలింగం పంతులు చమత్కార రత్నావళి, ఆంధ్ర నాటక పరిషత్, ధార్వాడ్, సురభి నాటక సమాజాల వరకు నాటకాలు సమాజంలోని రుగ్మతలను రూపుమాపి, మానవతా విలువలను కాపాడడానికి రచించి, ప్రదర్శించారని తెలిపారు. స్థానిక కళాకారులు ఎందరో నాటకం ద్వారా మానవ విలువలు కాపాడటానికి ఎంతో కృషి చేశారన్నారు. అత్తిలి పద్మ వీధి నాటకం “ఊరేగింపు” ద్వారా ప్రజలను చైతన్య పరచాలని వెల్లడించారు. నాటకో రక్షితి రక్షితః అని అందరూ భావించాలని కోరారు. నాటకాన్ని కాపాడుకుంటే, సమాజాన్ని నాటకం కాపాడుతుందని విశ్లేషించారు. ఈ సందర్భంగా, వీరవాసరం నాటక పరిషత్ అధ్యక్షులు గుండా రామకృష్ణ, భీమవరం అధ్యక్షులు, జవ్వాది దాశరధి శ్రీనివాస్, నాటక రంగాన్ని కాపాడుకోవడానికి చేయవలసిన, చేస్తున్న అంశాలు వివరించారు. వక్త గురించి ఎం శ్రీనివాసరావు పరిచయం చేశారు. కోశాధికారి ముచ్చర్ల వెంకట సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘ అధ్యక్షులు డాక్టర్ ప్రతాపరాజు, కవులు అన్నపూర్ణేశ్వరరావు, కోలాటి పెద్దిరాజు, కవి చేగొండి, ముత్యాల కళ్యాణి నాయుడు, ప్రధానోపాధ్యాయులు, కానుకొలను శ్రీనివాస్, జామాను రామలక్ష్మణరావు, పులఖండం శ్రీనివాస్, గంధం కుమార్ స్వామి రాజా, గుత్తుల సత్యనారాయణ, గాయకులు మూర్తి, తదితరులు హాజరయ్యారు.
నాటకం ప్రజల వద్దకు వెళ్లి, ముందు తరాలకు మానవ విలువలు అందించాలి. -నాటక రచయిత తాళాబత్తుల