జనరల్ డెస్క్: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్)నాటక రచయిత, సినిమా నటులు, ప్రముఖ సామాజికవేత్త గిరీష్ కర్నాడ్ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం బెంగళూరులోని ఆసుపత్రిలో మృతిచెందారు. మహారాష్ట్రలో మే 19, 1938లో జన్మించిన గిరీష్ కర్నాడ్ 1958లో కర్ణాటక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1963లో ఎం.ఏ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించారు. సామాజిక విలువల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తూ హిందుత్వవాదుల నుంచి నిర్భంధాన్ని ఎదుర్కొన్నారు.
కన్నడ సినిమాలో రచయితగా, ఫిలింమేకర్‌గా, సామాజిక ఉద్యమకారుడిగా సమాజంలో తన బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించారు. వీరు 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 1998లో జ్ఞాన పీఠ అవార్డును స్వీకరించారు. ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ 2017లో హత్య అనంతరం ఆ హింసను ఖండించడంలో ముందు వరుసలో నిలబడ్డారు. ఒక గౌరీని హత్య చేస్తే మేమందరం గౌరీలుగా మారతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. గిరీష్ కర్నాడ్ చాలా నాటకాలు రాశారు. వీటిలో 1961లో యయాతి, 1972లో హయ వదన, 1988లో నాగమందాల రచించారు. తెలుగు, కన్నడ సహా పలు భాషల్లోని సినిమాల్లో నటించారు. అంతేకాక పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు.
దేశంలో 300 సంస్థలతో పుణేలో ఎల్గార్ పరిషత్ ఏర్పడి భీమాకొరేగాంలో దళితులు తమ ఉద్యమ ఆకాంక్షను ప్రకటిస్తే, దాన్ని అణచివేయడం కోసం హిందుత్వ శక్తులు హింసకు పాల్పడి, ఇద్దరు దళితులను హత్య చేశాయి. దీన్ని నిరసిస్తూ తానూ అర్బన్ నక్సల్‌నేనని మెడలో బోర్డు వేసుకొని ప్రపంచానికి తెలియజేశారు, ప్రభుత్వాలను సవాల్ చేశారు. ప్రజాస్వామికవాదులపై జరుగుతున్న దాడులను నిలదీయడంలో తనవంతు బాధ్యతను నిర్వహించిన గిరీష్ కర్నాడ్ జీవితం చాలా విలువైనదని భావిస్తున్నామని విశ్లేషకుల అంచనా. హక్కుల కోసం పోరాడే ఏ ప్రజాస్వామిక గొంతుకలకైనా మద్దతుగా పౌరహక్కుల సంఘం నిలబడుతుందని తెలియ జేస్తూ గిరీష్ కర్నాడ్‌లాగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులుకు ఆయన స్ఫూర్తి ఉద్యమాలకు ఊపిరి పోస్తూనే ఉంటుంది. సృజనాత్మకతకు వారు చేసిన సేవలు మరిచిపోలేనివి.

గిరీష్ కర్నాడ్