
పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల నుంచి కొనుగోలు చేసే రొయ్యల గ్రేడ్లు మతలబు ద్వారా టన్నుకు రూ. 10 వేలు కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం జరిగిన సమావేశంలో ఆరోపించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు, దళారులు రొయ్యల రైతులను నష్టపరిచే మోసపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. గత నెల 29 నుంచి 70 నుంచి 80 కౌంటర్ వరకు పది రూపాయలు తగ్గించి రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. వాతావరణ పరిస్థితులు, వైరస్ దాడి వల్ల రొయ్య కనీస బరువు పెరగకుండానే రైతులు పట్టుబడి చేయవలసిన పరిస్థితి దాపురించిందన్నారు. నాణ్యత లేని సీడు, పెరిగిన మేత ధరలతో రైతు కల్చర్ చేయలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో ఆదుకోవాల్సింది పోయి దోపిడీకి పాల్పడటం తగదని హితవు పలికారు. రైతులు ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు చెల్లించిన బిల్లులు జాగ్రత్త పెట్టుకోవాలని భగవాన్ రాజు సూచించారు. తగ్గించిన సొమ్ము రైతులకు తిరిగి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మాత్యులు అచ్చం నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వివరించారు. అవసరమైతే అమరావతి వరకు పాదయాత్ర చేస్తామని, అక్కడ కూడా పరిష్కరించకపోతే, దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది రైతులతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. కోట్లాది రూపాయల విదేశీ మార్గద్రవ్యాన్ని ఆడ్జించి పెడుతున్న రొయ్యల రైతుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల భగవాన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మేడిది జాన్ డేవిడ్ రాజు, పెనుమత్స సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.