Telugu News Power

రిటైర్ అయినా, అక్రమ చర్యలపై వేటు తప్పదు. -కొరడా ఝులిపించిన కూటమి ప్రభుత్వం.

అమరావతి: జూన్,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) పదవిలో ఉన్న, లేకున్నా అధికారులు చేసిన తప్పిదానికి తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, కూటమి ప్రభుత్వం శుక్రవారం జీ. ఓ. విడుదల చేసింది. తొలిసారిగా ఈ జీవో ద్వారా రిటైర్డ్ తహసీల్దార్‌పై ప్రభుత్వం వేటు వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక ఉపేక్షించకుండా, అవినీతిపై కఠిన చర్యలు కోసం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉద్యోగ విరమణ (రిటైర్) చేసినా సరే, తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదని ఈ ఉత్తర్వు ద్వారా స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
ఎస్.ఎండి. ఖాసిం,వైఎస్ఆర్ కడప జిల్లా, పులివెందుల
మాజీ తహసీల్దార్,పై
జి ఓ ఎం ఎస్ నెం. 356, ఈ నెల 12న, రెవెన్యూ విజిలెన్స్ శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి.
పులివెందుల తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఆయన తీవ్రమైన అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారించింది.
“కాపు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్” కింద అర్హత లేని వారికి కూడా తప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేసారనే ఆరోపణలు రుజువయ్యాయి.
ఈ చర్య ఆంధ్రప్రదేశ్, పౌర సేవలు (ప్రవర్తన) నియమావళి 1964 కు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తేల్చింది.
ఆయన రిటైర్ అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సవరించిన పెన్షన్ నిబంధనలు 1980 లోని 9వ నిబంధన కింద ఖాసిం పై శాఖాపరమైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఈ విచారణను ఆంధ్రప్రదేశ్ పౌర సేవల (వర్గీకరణ, నియంత్రణ, విన్నపం,) నిబంధనలు, 1991 లోని నిబంధన-20 ప్రకారం నిర్వహించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల పై సమాజంలో ఇసుమంత కూడా సానుభూతి లేదు. అందులో ముఖ్యంగా రెవిన్యూ శాఖకు సంబంధించి కోట్ల మంది బాధితులు తాతల కాలం నుంచి జన్ జీ వరకు తప్పనిసరిగా చెప్పులు అరిగిపోయే వరకు తిరిగి, చేదు అనుభవాలు చవిచూసిన వారే ఎక్కువ. కొండకచో అధికారులు కళ్ళముందే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా కోకొల్లలుగా ఉన్నాయి. భారతదేశంలో అత్యంత అవినీతిమయమైన శాఖ, రెవిన్యూ శాఖ. ఇది ఆరోపణ కాదు. నిరూపించిన ప్రభుత్వ సర్వే. అధికారం మధంతో కళ్ళు నెత్తికెక్కి, ప్రజలకు సేవ చేయవలసింది పోయి, జీతం,జీవితం ఇచ్చే వారిపైనే పెత్తనం చెలాయించడం అంటే అవాంఛనీయ అధికారం కట్టబెట్టటమే. ఇందుకు రాజకీయ నాయకుల స్వార్థం ప్రధాన కారణం. కోట్లు కూడబెట్టాలనుకునే అధికారుల అంతులేని ధనదాహం రెండవది. ఇందుకు సజీవ సాక్ష్యం యర్రా శ్రీలక్ష్మి. అత్యంత గౌరవప్రదమైన కుటుంబ నేపథ్యం, అనన్య సామాన్యమైన మేధస్సు, చిన్న వయసులోనే ఐఏఎస్, ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి హోదాతో ఆంధ్ర రాష్ట్రానికి తొలి అవకాశం, ప్రత్యేకించి మహిళలగా చరిత్ర సృష్టించవలసిన ఆమె, జైళ్లలో మగ్గిపోయి, ఆరోగ్యం క్షీణించి, కోర్టుల చుట్టూ తిరిగి, తిరస్కారాలకు, అవమానాలకు గురై, తీవ్ర మానసిక క్షోభతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి కి పూలగుత్తి ఇవ్వబోగా, చీకొట్టినంత పని చేసిన దయనీయ పరిస్థితి ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించి, అయ్యో పాపం అన్నవారు కూడా లేరు. అధికారంలో ఉన్న నాయకులను నమ్ముకుని రెచ్చిపోతే, చివరికి జీవితం నరకమయమని అధికారులు గుర్తించాలి. రాజకీయ నాయకులు, అధికారుల బలహీనతను ఆసరాగా చేసుకుని వారి చేత తప్పులు చేయించి, తప్పించుకుపోవడం నుంచి బయటపడాలి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న అధికారులు కూడా ఉన్నారు. అర్హతలు,సమర్ధతలు లేని అనామకులను అధికార పీఠంపై కూర్చోబెట్టి, వారి కాలు కింద చెప్పులా వాడుకోవడం మానుకోవాలి. ప్రభుత్వం, అర్హత ఉన్న ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా చూడాలి. ఈ జీవో వల్ల ఏవో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించలేం. కానీ ఈ జీవో వల్ల అధికారుల్లో కొంత భయం కలుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.