Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో సంగీత విద్వాంసులకు, యోగా గురువులకు సత్కారం.

సంగీత, యోగ పండితులకు సత్కారం
సత్కారం అందుకున్న సంగీత విద్వాంసులు

భీమవరం : జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)

యోగ దినోత్సవం – ప్రపంచ సంగీత దినోత్సవం వేడుకలు మావుళ్లమ్మ దేవస్థానంలో ఘనంగా జరిగాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన సంగీత విద్వాంసులను, దేవస్థానం ఆస్థాన విద్వాంసులను ఘనంగా సత్కరించారు. విజ్ఞాన సమితి అధ్యక్షులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని కళాకారులకు శేషవస్త్రాలు, జ్ఞాపికలు, ప్రసాదాలు అందజేసారు. భారతీయ సాంస్కృతిక, సాంప్రదాయ వాద్యసంగీతానికి వారు అందిస్తున్న సేవలను కొనియాడారు.
అనంతరం యోగ రంగంలో విశేష సేవలందిస్తున్న నిపుణులు, సుదర్శన క్రియ శిక్షకులు కలిగొట్ల గోపాల శర్మను, యోగా శిక్షణ కార్యక్రమాలకు సహకరించిన దేవస్థానం ధర్మకర్త పాపొలు ఏడుకొండలు ద్వయాన్ని ప్రత్యేకంగా సన్మానించారు.
యోగ శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని, సంగీతం మనసుకు ప్రశాంతతను అందిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో యోగ, సంగీతం కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిషి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతెన రమణ, అరసవిల్లి సుబ్రహ్మణ్యం, యండా సత్యవతి తదితరులు పాల్గొన్నారు.