Skip to main content

Telugu News Power

నేటి నుంచి మంగళగిరి లో 2 రోజుల తెలుగు మహోత్సవం.

మంగళగిరి: జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)తెలుగు మాతృభాష వైభవాన్ని, సాహిత్య సంపదను, కళా సంప్రదాయాలను, జానపద వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం “తెలుగు మహోత్సవం” కార్యక్రమాన్ని ఈ నెల 25, 26, రెండు రోజులు గుంటూరు జిల్లా, మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా ఘనంగా నిర్వహిస్తోంది.ఈ మహోత్సవం అధికారిక గోడ పత్రికను రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి రాష్ట్ర సచివాలయంలో సంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని యువతకు చేరువ చేయడం, నిత్య జీవితంలో తెలుగు వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రపంచానికి తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పడం ఈ మహోత్సవం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.
“దేశభాషలందు తెలుగు లెస్స” అన్న శ్రీకృష్ణదేవరాయల వారి భావాన్ని సార్థకం చేస్తూ,ప్రతి తెలుగు హృదయాన్ని కలిపే సాంస్కృతిక వేడుకగా ఈ తెలుగు మహోత్సవాన్ని విజయవంతం చేయాలని. విద్యార్థులు, యువత, సాహిత్యాభిమానులు, కళాకారులు, ప్రతి తెలుగు భాషాభిమాని కుటుంబ సమేతంగా పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు.