
యలమంచిలి: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తాడిగరువు తోట లో వేంచేసియున్న, శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆషాడ మాస సారె ఉత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరీ మాతగా అలంకరించారు. ఫలపుష్పాదులు, వివిధ రకాల కూరగాయల సూచించిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, శిరీష బత్తుల ఆధ్వర్యంలో వందల మంది భక్తులు ఆషాడ మాస సారెతో గ్రామోత్సవం నిర్వహించారు. మూలస్థానేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి ప్రారంభించిన ఈ ఊరేగింపు గుంతల ముసలమ్మ వారి ఆలయం మీదుగా పురవీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా, భక్తులు వందల కేజీల మిఠాయిలు అమ్మవారికి సమర్పించుకున్నారు. వివిధ రకాల ఫలాలు భక్తులు అందజేశారు. దాదాపు 1000 మంది వరకు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తులకు మిఠాయిలు విరివిగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులు షుగర్ పెరిగిపోతుందని, లావైపోతారని అనుకోవడం వినిపించింది. ఈ కార్యక్రమానికి, వైజాగ్ బుజ్జి దాదాపు లక్ష రూపాయల విరాళం అందజేశారు. అమెరికాకు చెందిన, ఎలమంచిలి తాళ్లూరి వారి ఆడపడుచు, కరటూరి అనురాధ వారికి రూ. 50 వేలు విరాళం అందజేశారు. భక్తులకు వివిధ రూపాల్లో, చీరలు,పండ్లు స్వీట్లు, అమ్మవారికి అలంకరించిన కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. మహిళా భక్తులు అమ్మవారి ఆలయం వద్ద విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.ఈ కార్యక్రమంలో సిద్ధాని రాము, బొప్పున రాంబాబు, బొప్పున శివ, ఆకుల యేసు, చిలుకూరి సాయి, మేక శేషు, స్థానిక యువకులు,బొల్లింపల్లి వారి కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.