Skip to main content

Telugu News Power

ముగిసిన షావుకారు జానకి శకం. ఏడు పదుల సినీ ప్రయాణానికి ముగింపు.

బహుభాష నటి షావుకారు జానకి.

2026, చెన్నై:ఆగస్టు,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను తన నటనతో, ఎంతగానో అలరించిన సీనియర్ నటి షావుకారు జానకి శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మృతి సినీ ప్రపంచంలో విషాదాన్ని నింపింది.
అయితే, షావుకారు జానకి మరణ వార్తను కేవలం ఒక సీనియర్ నటి కన్నుమూతగా చూస్తే ఆమె ప్రయాణంలోని అసలు గొప్పతనం బయట ప్రపంచానికి, ముఖ్యంగా ఇప్పటి తరానికి తెలియకుండా పోతుంది. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో 1950లో వచ్చిన ‘షావుకారు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జానకికి అదే సినిమా పేరు ఆమె ఇంటిపేరుగా మారింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించి, అనేక తరాల ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఆమె ప్రత్యేకత కేవలం సినిమాల సంఖ్యలో లేదు. ఒకప్పుడు కథానాయికగా తెరపై కనిపించిన ఆమె, కాలం మారుతున్న కొద్దీ తల్లి, అత్త, బామ్మ, ఇతర కీలక పాత్రల్లోకి సహజంగా మారారు. అంటే హీరోయిన్ వయసు దాటిన తర్వాత కెరీర్ ముగిసిపోవాలనే భావనకు ఆమె ప్రయాణమే ఒక సమాధానంగా నిలిచింది. దశాబ్దాలు మారినా నటిగా తన ఉనికిని కొనసాగించడం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. షావుకారు జానకి ప్రయాణం భారతీయ సినిమా పరిణామానికి ఒక చరిత్ర పుస్తకం లాంటిది.గత 1950ల నాటి నలుపు-తెలుపు సినిమా నుంచి ఆధునిక చిత్రాల వరకు ఆమె ప్రయాణించారు. ఆమె 400వ సినిమా 2020 విడుదలైంది . భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీతో సత్కరించింది. తెరపై కనిపించిన పాత్రల కంటే పెద్దది ఆమె సినీ ప్రయాణమే అని చెప్పడానికి ఇవి కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు.
అయితే, కొత్త తరానికి షావుకారు జానకి పేరు తెలిసినా, ఆమె నటించిన సినిమాలు, పాత్రల వెనుక ఉన్న చరిత్ర ఎంతవరకు తెలుసు అనేది మరో ప్రశ్న. ఒక కళాకారిణి వెళ్లిపోయినప్పుడు సంతాపం వ్యక్తం చేయడం సహజం. కానీ ఆమె చేసిన పనిని తర్వాతి తరానికి పరిచయం చేయడం అంతకంటే ముఖ్యమైన బాధ్యత. పాత సినిమాలను కేవలం “పాతవి”గా కాకుండా, మన సినిమా సంస్కృతిలో భాగంగా చూడాల్సిన అవసరాన్ని కూడా ఈ మరణం గుర్తుచేస్తోంది. ఆమె నటించిన అక్క చెల్లెలు చిత్రంలో అమాయకపు పల్లెటూరి ఆడపిల్లగా, శోభనం గదిలో భర్త దగ్గర పాండవులు పాండవులు తుమ్మెద పాటలో ఆమె నటన అనితర సాధ్యమైనది. మంచి మనసులు, సినిమాలో కుండ మార్పులు పెళ్ళి వల్ల, అంధురాలైన ఆమె, తన భర్త ప్రేమ రాహిత్య జీవితాన్ని అనుభవిస్తూ, బగ్న ప్రేమికుడైన భర్త మనసు ఎలా గెలుచుకుందనే నటనతో ప్రేక్షకుల గుండెలు పిండేసి, కంట తడి పెట్టిస్తుంది. ఆమె చిత్రాలు, బరువైన ఆమె పాత్రల చుట్టూ తిరుగుతుంది. తరతారాలకు ఆ నటన గుర్తుండి పోతుంది. ఆమెకు సినీ ప్రేక్షకలోకం నివాళులు అర్పిస్తుంది.