Skip to main content

Telugu News Power

ఒడిశా తీరానికి సమీపంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌ లో ఫలించిన ఒఎన్జీసీ గ్యాస్‌ అన్వేషణ. ‘సముద్ర మంథన్‌’లో తొలి విజయం.

భువనేశ్వర్‌: సెప్టెంబర్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత చమురు, సహజ వాయువు అన్వేషణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా తీరానికి సమీపంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఒఎన్జీసీ ) సహజ వాయువును గుర్తించింది. కోణార్క్‌ తీరానికి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో లోతైన సముద్రంలో చేపట్టిన అన్వేషణలో ఈ గ్యాస్‌ లభ్యమైంది.
ఒఎన్జీసీ చేపట్టిన ప్రస్తుత డీప్‌వాటర్‌ అన్వేషణ కార్యక్రమంలో ఏం ఎన్=డి డబ్ల్యూ18-1-హెచ్-డి (ఎం డి డబ్లయూ -28) బావి తొలి బావిగా ఉంది. ‘సముద్ర మంథన్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది జూలై 25, ఈ బావిలో డ్రిల్లింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 1,623 మీటర్ల లక్ష్య లోతు వరకు తవ్వగా, 1,441–1,452 మీటర్ల మధ్య గ్యాస్‌ ఉన్నట్లు గుర్తించారు.
మూడు రోజులుగా గ్యాస్‌ ప్రవాహం
బావి నుంచి గ్యాస్‌ ప్రోత్సాహకరమైన రేటుతో, స్థిరమైన రిజర్వాయర్‌ ఒత్తిడితో ప్రవహిస్తున్నట్లు ఒఎన్జీసీ తెలిపింది. అయితే ఇప్పటివరకు గ్యాస్‌ నిల్వల పరిమాణం, ఖచ్చితమైన ఉత్పత్తి సామర్థ్యం వంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. తదుపరి పరీక్షలు, అంచనాల అనంతరం ఈ ఆవిష్కరణ వాణిజ్యపరంగా ఎంతవరకు ఉపయోగకరమో నిర్ణయించనున్నారు.
దేశీయ ఇంధన భద్రతకు ఊతం:
భారత్‌ తన ఇంధన అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా సహజ వాయువు లభించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఈ నిల్వలు వాణిజ్యపరంగా సాధ్యమైన స్థాయిలో ఉన్నట్లు తదుపరి పరిశీలనల్లో నిర్ధారణ అయితే, దేశీయ గ్యాస్‌ సరఫరాను పెంచేందుకు ఇది దోహదపడే అవకాశం ఉంది. విద్యుత్‌, ఎరువులు, పరిశ్రమలు, సిటీ గ్యాస్‌ వంటి అనేక రంగాల్లో సహజ వాయువు వినియోగం ఉంది.
మహానది బేసిన్‌లో గతంలో గుర్తించిన ఉత్కల్‌, కోణార్క్‌ గ్యాస్‌ ఆవిష్కరణలతో కలిపి తాజా కనుగొనుగొలను భవిష్యత్తులో ఉమ్మడి మౌలిక వసతుల ద్వారా అభివృద్ధి చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే దీనికి మరింత అంచనా, వాణిజ్యపరమైన అధ్యయనం అవసరం.
మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌లో తాజా గ్యాస్‌ ఆవిష్కరణ భారత సముద్రగర్భ ఇంధన అన్వేషణలో మరో కీలక ముందు అడుగుగా నిలిచింది.